వెయ్యి రోజుల పాలనలో పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలం

-బీఆర్ఎస్, బీజేపీ చర్చకు సిద్ధమా? – జగ్గారెడ్డి
-కేటీఆర్ ముందుగా మీ ఇల్లు చక్కదిద్దుకోండి.. మా ఇంటి సంగతి మీకెందుకు?
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 2 (రథసారథి న్యూస్):
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చర్చకు సిద్ధమా? అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ చేశారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని జగ్గారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్య్ర వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు సైతం సచివాలయంలోకి వెళ్లి తమ సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు సబ్సిడీ వంటగ్యాస్, సన్నబియ్యం పంపిణీ, అర్హులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించిన జగ్గారెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు.
-పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధం
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చర్చకు సిద్ధమైతే తాము సిద్ధంగా ఉన్నామని జగ్గారెడ్డి అన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల్లోనైనా చర్చకు రావాలని సవాల్ చేశారు. మహిళలతో కలిసి ఉచిత బస్సు ప్రయాణం చేసి పథకం అమలును పరిశీలిద్దామని, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లపై కూడా బహిరంగంగా చర్చిద్దామని అన్నారు.
-తెలంగాణ ఏర్పాటుపై కేటీఆర్‌కు ప్రశ్నలు
రాహుల్‌గాంధీపై కేటీఆర్ విమర్శలు చేయడాన్ని జగ్గారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సోనియాగాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసిన నేపథ్యంలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.. కేటీఆర్ మంత్రి అయ్యారు” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ నాయకత్వం చుట్టూ తిరిగిన వారు ఇప్పుడు అదే నాయకత్వాన్ని విమర్శించడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల పాత్రను ఒక కుటుంబం తమ ఖాతాలో వేసుకుందని విమర్శించారు. ఉద్యమ సమయంలో విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని, కేసీఆర్ కుటుంబంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అన్నారు.
-కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు
కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన జగ్గారెడ్డి, “బీఆర్ఎస్ ఇలాగే ప్రతిపక్షంలో ఉండండి.. అసెంబ్లీకి రాకండి” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేటీఆర్.. ముందుగా మీ ఇల్లు చక్కదిద్దుకోండి. మా ఇంటి సంగతి మీకెందుకు?” అని అన్నారు. ఏ పార్టీలోనైనా అంతర్గత విభేదాలు సహజమేనని, బీఆర్ఎస్లోనూ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో అమలు చేసిన పథకాలపై తాము ప్రజల మధ్యకు వెళ్లి వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా తమ వాదనలను ప్రజల ముందు వెల్లడించేందుకు సిద్ధం కావాలని జగ్గారెడ్డి సవాల్ చేశారు.



