Sangareddy

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

*-డిజిటల్‌ చెల్లింపులు, ఆన్‌లైన్‌ షాపింగ్‌, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తప్పనిసరి
మోసానికి గురైతే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలి

-జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 2 (రథసారథి న్యూస్): ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ సూచించారు. సెప్టెంబర్‌ మొదటి బుధవారం నిర్వహించే సైబర్‌ జాగృత దినోత్సవాన్ని పురస్కరించుకుని సదాశివపేట పట్టణంలోని హర్ష బ్యాంకెట్‌ హాల్‌లో బుధవారం సైబర్‌ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌, తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ జాగృత దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

డిజిటల్‌ చెల్లింపులు, ఆన్‌లైన్‌ షాపింగ్‌, పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు. డిజిటల్‌ చెల్లింపుల సమయంలో తెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవవద్దని, వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ), పిన్‌, సీవీవీ, పాస్‌వర్డ్‌ వంటి రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. బ్యాంకు అధికారులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ సంస్థల పేరుతో ఫోన్‌ చేసే వ్యక్తులను నమ్మి వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలు వెల్లడించరాదన్నారు.

నగదు బదిలీ చేసే ముందు సరైన వ్యక్తి లేదా ఖాతాకే డబ్బు వెళ్తుందో నిర్ధారించుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో భారీ రాయితీలు, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. గుర్తుతెలియని వెబ్‌సైట్లు లేదా వ్యక్తులకు ముందస్తుగా నగదు చెల్లించకుండా విశ్వసనీయమైన వేదికలను మాత్రమే వినియోగించాలని సూచించారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని హామీ ఇచ్చే ఆన్‌లైన్‌ పెట్టుబడులు, ట్రేడింగ్‌, క్రిప్టో కరెన్సీ, షేర్‌ మార్కెట్‌ పేరుతో వచ్చే అనుమానాస్పద ఆఫర్లను నమ్మవద్దని హెచ్చరించారు.

పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత వ్యక్తులు, సంస్థల వివరాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. ఎవరైనా సైబర్‌ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్‌ నేరాల సహాయవాణికి సమాచారం ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సైబర్‌ నేరాల ఫిర్యాదు వెబ్‌ వేదికలో ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ తెలిపారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గణేశ్‌ చతుర్థి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో గణేశ్‌ మండపాల వద్ద కూడా సైబర్‌ నేరాలపై అవగాహన పోస్టర్లను ఏర్పాటు చేసి భక్తులు, ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

శాంతి కమిటీ, సమన్వయ సమావేశాలను సైతం సైబర్‌ అవగాహన కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. సైబర్‌ నేరాల నియంత్రణలో పోలీసులతో పాటు ప్రజల అప్రమత్తత కూడా కీలకమని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ఆర్థిక నష్టానికి దారితీస్తుందని ఎస్పీ అన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్‌ భద్రతా నియమాలను పాటించడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీ4సీ డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి, సదాశివపేట ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌, ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి, సైబర్‌ సెల్‌ సిబ్బంది, సదాశివపేట పట్టణానికి చెందిన సుమారు 350 మంది వ్యాపారులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button