హామీల అమలుకు బీఆర్ఎస్ నిరసన

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 6 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో అమలు కానివాటిని ప్రజలకు వివరించారు. గ్రామానికి రావాల్సిన పెండింగ్ హామీలను గుర్తు చేస్తూ ‘బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ జిల్లా డైరెక్టర్ నగేష్ కురుమ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్న రెండేళ్ల పదవీకాలంలో హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నరేష్‌గౌడ్, సీహెచ్ బాబూజీ, దండే నవీన్, మల్లగారి యోహాన్, మన్నె మధు, కొత్తగొల్ల మల్లేశం, సోలాపూర్ శంకర్, దుర్గం పోయిని పెద్ద పోచయ్య, కుదైగారి సలీం, కవిలే యాదగిరి, బరురి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
