Sadashivpet

రూ.50 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది!

అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని విజ్ఞప్తి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 31 (రథసారథి న్యూస్): పట్టణంలోని సదాశివపేట పోలీస్‌ స్టేషన్‌ వెనుక, జాతీయ రహదారి–65కు సుమారు 500 మీటర్ల దూరంలో మోమిన్‌పేట్‌ రోడ్డును ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమ్మరి కుంటకు సంబంధించిన సర్వే నంబర్‌ 414లో సుమారు 4 ఎకరాల 26 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రభుత్వ స్థలం ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం సుమారు రూ.50 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

కొందరు వ్యక్తులు రేకుల షెడ్లు, ఇతర తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసి తమకు అనుకూలంగా ఉన్న మేరకు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. విలువైన ప్రభుత్వ స్థలం క్రమంగా కబ్జాకు గురైతే భవిష్యత్‌లో ప్రజా అవసరాలకు ఉపయోగపడే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజా ప్రయోజనాలను, భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే సర్వే నంబర్‌ 414లోని ప్రభుత్వ భూమిని పరిశీలించి, అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరారు. భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button