కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట
సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు ఏడు రోజుల నిరసన కార్యక్రమాలు

–పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 31 (రథసారథి న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు ‘కాంగ్రెస్ 1000 రోజుల పాలన–420 మోసాలు’ పేరుతో సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న ఏడు రోజుల నిరసన కార్యక్రమాలపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఏడు రోజుల కార్యక్రమాల నిర్వహణపై నాయకుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్ర గౌడ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు అందిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.
ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వానికి ప్రజలు తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఏడు రోజుల కార్యక్రమాలను నియోజకవర్గంలో విస్తృతంగా చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, ‘బాకీ కార్డుల’ రూపంలో హామీలను ప్రతి గడపకు చేరవేయాలని పిలుపునిచ్చారు. రానున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చింతా ప్రభాకర్ అన్నారు. తన ఆరోగ్యం సహకరించకపోయినా తన విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజల రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరికీ నష్టం కలిగించాలని భావించే వ్యక్తిని కాదని, రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, అలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నానని తెలిపారు.
-బాకీ కార్డులు ప్రతి గడపకు చేర్చాలి
నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్ర గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ బాకీ కార్డులను ప్రతి గడపకు అందించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసిన తీరును అభినందించారు. అదే స్ఫూర్తితో ఏడు రోజుల నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల నిర్వహణలో సంగారెడ్డి జిల్లా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
-ఏడు రోజుల కార్యక్రమాలివే
సెప్టెంబర్ 2: తెలంగాణ భవన్‌లో లోగో ఆవిష్కరణతో కార్యక్రమాల ప్రారంభం. సాయంత్రం 6 గంటలకు విలేకరుల సమావేశం. నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, బాకీ కార్డుల పంపిణీ, 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన.
సెప్టెంబర్ 3: వ్యవసాయ రంగం, సాగునీరు, విద్యుత్, యూరియా, రైతుబీమా తదితర అంశాలపై రైతు సదస్సులు.
సెప్టెంబర్ 4: వృద్ధులు, దివ్యాంగులు, మహిళలతో సదస్సులు. మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, తులం బంగారం తదితర హామీల అమలును ప్రశ్నిస్తూ వంటావార్పు.
సెప్టెంబర్ 5: విద్యార్థులు, యువత సమస్యలపై ర్యాలీలు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాల జాబ్ క్యాలెండర్, యువత ప్రకటనలోని హామీలు, విద్యార్థులకు స్కూటీల పంపిణీ తదితర అంశాలపై నిరసనలు.
సెప్టెంబర్ 6: పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్యలపై గ్రామస్థాయిలో నిరసన కార్యక్రమాలు. సెప్టెంబర్ 7: జిల్లా, మండల ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలును కోరుతూ వినతిపత్రాల సమర్పణ.
సెప్టెంబర్ 8: జిల్లా కేంద్రంలో ఏడు రోజుల కార్యక్రమాలపై విలేకరుల సమావేశం. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ. సెప్టెంబర్ 10న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చేపట్టే నిరసన కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ తరఫున సంఘీభావం ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో మాజీ డీసీసీబీ ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, సీనియర్ నాయకులు హకీమ్, డాక్టర్ శ్రీహరి, మాజీ జడ్పీటీసీలు మనోహర్ గౌడ్, కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, విఠల్, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



