విద్యార్థులకు మహిళల భద్రత, చట్టాల పై అవగాహన సదస్సు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 31 (రథసారథి న్యూస్): జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు సంగారెడ్డి షీ టీం ఆధ్వర్యంలో సోమవారం పలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు న్యాయ, మహిళా భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించారు. తారా డిగ్రీ కళాశాల, ఎస్‌బీఐ శిక్షణ కేంద్రం, విద్యాభారతి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులకు మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలు, వేధింపులు, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.
ఆపద సమయంలో భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని, సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వేధింపులు లేదా సైబర్ మోసాలకు గురైనప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని తమ హక్కులను పరిరక్షించుకోవడంతో పాటు ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని షీ టీం సిబ్బంది సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని, విద్యార్థులు పోలీసుల సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



