Sangareddy

బుదేరా గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

విద్యార్థినుల ఫిర్యాదులపై అధికారుల విచారణ

-నిర్వహణలో లోపాలు, నిర్లక్ష్య వైఖరిపై చర్యలు

-నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

సంగారెడ్డి ప్రతినిధి ఆగస్టు 31 (రథసారధి న్యూస్): బుదేరాలోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.శైలజను జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సస్పెండ్‌ చేశారు. కళాశాల నిర్వహణలో లోపాలు, పరిపాలనా వ్యవహారాల్లో నిర్లక్ష్యం, విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో వైఫల్యం, విద్యార్థినుల పట్ల ప్రిన్సిపాల్‌ వ్యవహరిస్తున్న తీరుపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.

కళాశాలలో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని, ఆహారంలో తరచూ పురుగులు కనిపిస్తున్నాయని, పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని విద్యార్థినులు ఆరోపించారు. కళాశాల ప్రాంగణంలో పారిశుద్ధ్య లోపాలు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన వ్యాపించడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. వసతి గదుల విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పరిసరాల్లో విషపూరిత కీటకాలు కనిపిస్తుండటంతో భద్రతపై ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. కళాశాలకు అందించిన వంటగ్యాస్‌ సిలిండర్లు సైతం వినియోగంలోకి రాలేదని ఫిర్యాదులో తెలిపారు.

అంతేకాకుండా ప్రిన్సిపాల్‌ తమను దూషిస్తూ, అవమానకరమైన పదజాలంతో మాట్లాడుతున్నారని, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. తమకు కేటాయించిన గదుల్లో కాకుండా ప్రిన్సిపాల్‌ గదికి సమీపంలో నిద్రించాల్సిందిగా ఆదేశిస్తున్నారని, అందుకు నిరాకరిస్తే బెదిరింపులు, శిక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు విద్యార్థినులు ఫిర్యాదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆదేశాల మేరకు నియోజకవర్గ ప్రత్యేక అధికారి జగదీష్‌, మండల ప్రత్యేక అధికారి రామాచారి, జిల్లా సమన్వయకర్త కల్పన బుదేరా కళాశాలను సందర్శించారు.

కళాశాల నిర్వహణ, పరిపాలనా వ్యవహారాలు, విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. నివేదికలోని అంశాలను పరిశీలించిన అనంతరం ప్రిన్సిపాల్‌ పి.శైలజ నిర్లక్ష్య ధోరణి, కళాశాల నిర్వహణలో లోపాలు, విద్యార్థినుల పట్ల తగిన విధంగా వ్యవహరించకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్‌ ఆమెను సస్పెండ్‌ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెసిడెన్షియల్‌ కళాశాలల్లో విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణంతో పాటు అవసరమైన సౌకర్యాలు, భద్రత కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ స్పష్టం చేశారు. విద్యార్థినుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ కళాశాలల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button