ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామస్థుల భాగస్వామ్యం అవసరం
-పెద్దచెల్మెడలో తల్లిదండ్రుల సమావేశం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 6 (రథసారథి న్యూస్):
మునిపల్లి మండలంలోని పెద్దచెల్మెడ గ్రామంలో ప్రభుత్వ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. గ్రామంలోని పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయురాలు సంతోషికుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు, జేఏసీ సహ కన్వీనర్ అశోక్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంలో గ్రామస్థులు, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు చొరవ చూపాలని సూచించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ప్రధానంగా లాభాపేక్షతో పనిచేస్తాయని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రజల చొరవతోనే మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం 20 శాతం నిధులు కేటాయిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని అన్నారు. ప్రధానోపాధ్యాయురాలు సంతోషికుమారి మాట్లాడుతూ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు. తమ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాచార, ప్రసార సాంకేతికత ఆధారిత బోధన అందించే ఉపాధ్యాయులు కూడా ఉన్నారని వివరించారు. పెద్దచెల్మెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ.1.62 కోట్లు మంజూరు చేయించడంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకరించారని, ఇందుకు స్థానిక సర్పంచ్ రాధాబాయి బాలకృష్ణ పంతులుకు ప్రధానోపాధ్యాయురాలు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. జిల్లా సహాధ్యక్షురాలు మానస మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య ప్రైవేటు పాఠశాలల్లో ప్రతిచోటా లభించదని పేర్కొన్నారు. స్థానిక నాయకుడు బాలకృష్ణ పంతులు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారంతో నూతన పాఠశాల భవనానికి నిధులు మంజూరు కావడం సంతోషకరమన్నారు.
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. పదో వార్డు సభ్యుడు రాజు మాట్లాడుతూ ఉచిత పథకాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచీ ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి, గ్రామస్థులను సమీకరించడంలో కీలకపాత్ర పోషించిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెద్దాపురం దుర్గయ్య మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని, ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాబా, వార్డు సభ్యులు శ్రీధర్, రవి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మునిపల్లి మండల కార్యదర్శి రవీందర్, ఉపాధ్యాయులు సూరజ్, ఎస్ఎంఎస్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు నరేంద్ర, బాలరాజ్, ప్రశాంత్, అశోక్, దినకర్, వికాస్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.



