Sangareddy

కంది గ్రామ సమస్యలపై బీఆర్‌ఎస్‌ నిరసన

-పల్లెల్లో విధ్వంసం–పడకేసిన పారిశుద్ధ్యం పేరుతో ఆరవ రోజు కార్యక్రమం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 6 (రథసారథి న్యూస్):

కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పిలుపు మేరకు కంది గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరవ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌ బాకీ కార్డులు పంపిణీ చేస్తూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై వివరించారు.

ఈ సందర్భంగా కంది గ్రామంలోని పలు సమస్యలను నాయకులు ప్రస్తావించారు. శంకర్‌పల్లి రోడ్డు నుంచి కంది మీదుగా కాశీపూర్‌ రోడ్డు వరకు డివైడర్‌ మధ్యలో ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై వీధి దీపాల్లో అనేకం వెలగడం లేదని ఆరోపించారు. కాలిపోయిన దీపాల స్థానంలో కొత్త దీపాలను ఏర్పాటు చేసి రహదారిని వెలుగులతో నింపాలని డిమాండ్‌ చేశారు. అలాగే గ్రామంలోని హైమాస్ట్‌ దీపాలు పనిచేయని ప్రాంతాల్లో కొత్త దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. కంది గ్రామంలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని, సుమారు 500 వరకు వీధి కుక్కలు సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని నాయకులు తెలిపారు.

కంది మండల కార్యాలయానికి, గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మరుగుదొడ్లు, స్నానపు గదుల వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ప్రజలకు అవసరమైన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కంది గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన రూ.5ల నీటి శుద్ధి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని, పల్లె ప్రకృతి వనం నిర్వహణను మెరుగుపరిచి పరిశుభ్రంగా ఉంచి ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ప్రతి ఇంటికీ తడి, పొడి చెత్త కోసం వేర్వేరు చెత్త బుట్టలను అందించాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో పాలకవర్గం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా దోమల సమస్య పరిష్కారం కాలేదని నాయకులు ఆరోపించారు.

దోమల నివారణకు క్రమం తప్పకుండా మందు పిచికారీ చేయడంతో పాటు గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పాలకవర్గం విఫలమైతే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కంది గ్రామ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు వడ్ల రవికుమార్, నాయకులు కే. ఆనందరావు, కరీంఖాన్, పి. కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button