Sangareddy

నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి

-ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి యువతకు ఉపాధి కల్పించాలి

-స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి: డీవైఎఫ్‌ఐ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్‌ 6: (రథసారథి న్యూస్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోందని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌ ఆరోపించారు. నిరుద్యోగ యువతకు తక్షణమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

కొండాపూర్‌ మండల కేంద్రంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) సంగారెడ్డి జిల్లా 4వ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆనగంటి వెంకటేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఆ హామీ మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని ఆరోపించారు. నీట్‌, రైల్వే, బ్యాంకింగ్‌ తదితర పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకోవడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు రాష్ట్రాల్లోని ఖాళీలను కూడా తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి నియామక ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చిందని వెంకటేష్‌ తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జాబ్‌ క్యాలెండర్‌తో పాటు పలు హామీలు అమలు కాలేదని విమర్శించారు. సమగ్ర వివరాలతో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి, ఉద్యోగ నియామకాలకు తక్షణమే ప్రకటనలు విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్‌ చేశారు.

స్వయం ఉపాధి కోసం ప్రకటించిన రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకే పరిమితం కాకుండా, అర్హులైన నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల సాధన కోసం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. డీవైఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి జయరాజు, మాజీ నాయకుడు అతిమేల మాణిక్‌ మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అక్రమ రవాణాపై నిరంతర నిఘా పెట్టి విద్యార్థులు, యువతను మాదకద్రవ్యాల బారినుంచి కాపాడాలని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానిక యువతకు తగిన స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదని వారు ఆరోపించారు. స్థానిక వనరులను వినియోగించుకుంటున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహాసభల సందర్భంగా కొండాపూర్‌ మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీవైఎఫ్‌ఐ జెండాను జిల్లా కార్యదర్శి అనిల్‌ ఆవిష్కరించారు.

కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అనిల్‌, నాయకులు ఎం. శ్రీకాంత్‌, ప్రశాంత్‌, జె. శ్రీకాంత్‌, బాబురావు, వాణి, రమేష్‌, సాయికుమార్‌, అర్జున్‌, ప్రజా సంఘాల నాయకులు రాజయ్య, నాగభూషణం, రాజు, నాగరాజుతో పాటు సుమారు 100 మంది యువత పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button