సంగారెడ్డి జిల్లాలో సర్వేయర్ల కొరత.. వేలాది భూ సర్వే దరఖాస్తులు పెండింగ్
ఫీజులు చెల్లించినా నెలల తరబడి నిరీక్షణ.. -నారాయణఖేడ్ రీ-సర్వేకు డిప్యూటేషన్‌తో మండలాల్లో పనులు స్తంభనం -భూభారతి దరఖాస్తులు పేరుకుపోతుండగా.. -సర్వే కొరకు ఎదురుచూస్తున్న రైతుల తీవ్ర ఆందోళన

-ఫీజులు చెల్లించినా నెలల తరబడి నిరీక్షణ..
-నారాయణఖేడ్ రీ-సర్వేకు డిప్యూటేషన్‌తో మండలాల్లో పనులు స్తంభనం
-భూభారతి దరఖాస్తులు పేరుకుపోతుండగా..
-సర్వే కొరకు ఎదురుచూస్తున్న రైతుల తీవ్ర ఆందోళన
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 17 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి జిల్లాలో భూ సర్వేయర్ల కొరత తీవ్రరూపం దాల్చడంతో భూముల కొలతలు నిలిచిపోయి వేలాది మంది రైతులు, భూస్వాములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సర్వేకు సంబంధించిన దరఖాస్తులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, వాటి పరిష్కారం మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో దరఖాస్తుదారులు నెలల తరబడి సర్వేయర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం నారాయణఖేడ్ నియోజకవర్గంలో సబ్‌కలెక్టర్ పర్యవేక్షణలో రీ-సర్వే కార్యక్రమం జరుగుతోంది. ఈ పనుల కోసం జిల్లాలోని వివిధ మండలాల నుంచి 20 మందికి పైగా మండల సర్వేయర్లను డిప్యూటేషన్‌పై అక్కడికి పంపించారు. దీంతో మిగిలిన మండలాల్లో సర్వేయర్లు లేకపోవడంతో సాధారణ భూ సర్వేలు పూర్తిగా మందగించాయి. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు కొత్తవి జతకావడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది.
-భూభారతి దరఖాస్తుల వెల్లువ..
భూభారతి చట్టం అమలులో భాగంగా భూ వివాదాల పరిష్కారం, హద్దుల నిర్ధారణ, సర్వే నంబర్ల సవరణ, భూ రికార్డుల సరిదిద్దడం వంటి అంశాలపై పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. అయితే అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ఆ దరఖాస్తులు కార్యాలయాల్లోనే పేరుకుపోతున్నాయి. ఇటీవల జిల్లా యంత్రాంగం లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించినప్పటికీ, వారి సంఖ్య అవసరానికి తగినంత లేకపోవడంతో పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. మరోవైపు వారికి కూడా అదనపు బాధ్యతలు అప్పగించడంతో ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం కొనసాగుతోంది.
జిల్లాలోని 28 మండలాలకు కనీసం ఒక్కో మండలానికి ఒక్కో సర్వేయర్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీల గ్రేడ్‌ను బట్టి అదనపు సర్వేయర్లు అవసరం. కానీ ప్రస్తుతం ఉన్న సిబ్బందిపైనే అనేక అదనపు బాధ్యతలు ఉండటంతో మండల స్థాయిలో భూ సర్వేలు ముందుకు సాగడం లేదు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 760 రెవెన్యూ గ్రామాలు, 1,67,948 సర్వే నంబర్లు ఉన్నాయి. వీటిలో చాలావరకు పాత రికార్డులే కావడంతో భూముల హద్దులు చెరిగిపోవడం, సర్వే రాళ్లు కనిపించకపోవడం, పక్క భూములతో వివాదాలు తలెత్తడం సాధారణమైంది. దీంతో సర్వే అవసరం రోజురోజుకు పెరుగుతోంది.
-ఫీజులు చెల్లించినా సర్వే ఎప్పుడు?
మండల స్థాయి సర్వేకు రూ.295, జిల్లా స్థాయి సర్వేకు రూ.1,400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే డబ్బులు చెల్లించిన తర్వాత కూడా నెలల తరబడి సర్వే జరగక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్వే నిర్వహించే ముందు సరిహద్దు భూ యజమానులకు నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, గతంలో ఈ బాధ్యతను నిర్వహించిన వీఆర్వోలు లేకపోవడంతో నోటీసుల జారీ కూడా ఆలస్యమవుతోంది.
-రైతులను వెంటాడుతున్న భూ సమస్యలు
జిల్లాలో ప్రధానంగా పట్టాదారు పాస్‌పుస్తకాలలో నమోదైన విస్తీర్ణం, వాస్తవ భూమి విస్తీర్ణంతో సరిపోకపోవడం, తహసీల్దార్ కార్యాలయ రికార్డులు మరియు పాస్‌పుస్తకాలలో సర్వే నంబర్లు భిన్నంగా ఉండటం, వారసత్వ మార్పులు నమోదు కాకపోవడం, హద్దుల వివాదాలు వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ కారణంగా రైతులు కోర్టులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
-అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలనే డిమాండ్
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సర్వే దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రైతులు, భూస్వాములు కోరుతున్నారు. రీ-సర్వే పనులతో పాటు సాధారణ సర్వేలకు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అవసరమైతే తాత్కాలిక సర్వేయర్లను నియమించి సేవలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భూసర్వే పూర్తికాక భూముల కొనుగోలు–అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు, వ్యవసాయ పెట్టుబడులు నిలిచిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పెండింగ్‌లో ఉన్న అన్ని సర్వే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.



