Sangareddy

సంగారెడ్డి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సమన్వయ సమావేశం

శాశ్వత చర్యలపై అధికారులతో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సమీక్ష

-శాశ్వత చర్యలపై అధికారులతో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సమీక్ష

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 17 (రథసారథి న్యూస్):

సంగారెడ్డి పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ కల్పించేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ అధ్యక్షతన పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు, బైపాస్ రోడ్డు, సాయిబాబా కమాన్, కల్వకుంట రోడ్డు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

ఫుట్‌పాత్‌లపై అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని వెనక్కి తరలించడం లేదా ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించడం, ఆటోరిక్షాల కోసం ప్రత్యేక ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయడం, అవసరమైన చోట బొల్లార్డ్స్ ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. పాదచారులు సురక్షితంగా ఫుట్‌పాత్‌లపై నడిచేలా ఆక్రమణలను తొలగించాలని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు.

సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత, వైస్ చైర్మన్ షేక్ షఫీ, ఆర్డీఓ రాఘవేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ జయరాం, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, టౌన్, రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌తో పాటు పోలీసు, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button