సర్వర్ డౌన్‌తో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సేవలు స్తంభింపు
స్లాట్లు బుక్ చేసుకున్న క్రయ–విక్రయదారులకు చుక్కలు చూపిన సాంకేతిక వైఫల్యం,గంటల తరబడి కార్యాలయం ఎదుట పడిగాపులు... ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 20 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం తీవ్ర సాంకేతిక అంతరాయం ఏర్పడి రిజిస్ట్రేషన్ సేవలు గంటలపాటు స్తంభించాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రధాన సర్వర్ పూర్తిగా పనిచేయకపోవడంతో భూములు, ఇళ్లు, ఫ్లాట్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.
ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకుని, ముహూర్తాలు నిర్ణయించుకుని వచ్చిన క్రయ–విక్రయదారులు, సాక్షులు కార్యాలయం ఎదుట గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. సర్వర్ పనిచేయకపోవడంతో కొత్త స్లాట్ బుకింగ్‌లు, చలాన్ల చెల్లింపులు, ఈ-కేవైసీ ధృవీకరణతో పాటు అన్ని ఆన్లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వేలాది రూపాయలు ఖర్చు చేసి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులతో వచ్చిన కుటుంబాలు కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి రావడంతో అసహనం వ్యక్తం చేశారు.
-అధికారుల వద్ద స్పష్టత కరువు
సర్వర్ ఎందుకు నిలిచిపోయిందన్న విషయంపై క్షేత్రస్థాయి అధికారుల వద్ద కూడా స్పష్టమైన సమాచారం లేకపోవడం గమనార్హం. సాంకేతిక లోపమా? లేక ఇతర కారణాలా? అనే సందేహాలకు సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియక అధికారులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది.
-తరచూ ఇదే తంతు… ప్రజలకు నరకయాతన
రిజిస్ట్రేషన్ శాఖలో తరచూ సర్వర్ సమస్యలు తలెత్తుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని డాక్యుమెంట్ రైటర్లు, ప్రజలు మండిపడ్డారు. స్లాట్ బుక్ చేసుకున్న సమయానికే రిజిస్ట్రేషన్ జరిగేలా పటిష్టమైన సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, లేకపోతే ప్రజల సమయం, ధనం వృథా అవుతూనే ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత సర్వర్ తిరిగి పనిచేయడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పునఃప్రారంభమైనప్పటికీ, అప్పటికే గంటలపాటు నిరీక్షించిన ప్రజలు తీవ్ర అసంతృప్తితో కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి రిజిస్ట్రేషన్ శాఖలో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని క్రయ–విక్రయదారులు డిమాండ్ చేస్తున్నారు.



