సంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 11 (రథసారథి న్యూస్): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. కె. లలితాదేవి ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య సంస్థల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వివిధ కార్యక్రమాల అధికారులతో కలిసి మొత్తం 20 ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య సంస్థలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో ప్రభుత్వ నిబంధనల అమలు, వైద్య సేవల నిర్వహణ, రికార్డుల నమోదు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ లేని మూడు ఆసుపత్రులకు వివిధ కారణాలతో అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే పోతిరెడ్డిపల్లిలోని మెహర్ ఫిజియోథెరపీ క్లినిక్‌ను నిర్ణీత కాలానికి పునరుద్ధరించుకోకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో నిబంధనల ప్రకారం అధికారులు క్లినిక్‌ను మూసివేశారు.
జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులు, క్లినిక్‌లపై నిరంతరం తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలు గుర్తించిన చోట కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. కె. లలితాదేవి తెలిపారు.



