Sangareddy

సంఘం బలోపేతానికి ఉద్యోగులంతా ఐక్యంగా కృషి చేయాలి

-నాల్గవ తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 11 (రథసారథి న్యూస్):

నాల్గవ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం సంఘం తరఫున నిరంతరం పోరాడుతామని తెలిపారు. సంగారెడ్డి సంఘ భవన్‌లో జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మొహమ్మద్‌ షరీఫ్‌, కార్యదర్శి జె. నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్థాయి స్థిర మండలి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దాస్య నాయక్‌, కార్యదర్శి ఖాదర్‌ బిన్‌ హసన్‌, సహాయ అధ్యక్షుడు రాజేందర్‌, కోశాధికారి ధనరాజ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

జిల్లా టీఎన్‌జీఓఎస్‌ సంఘం అధ్యక్షుడు మొహమ్మద్‌ జావిద్‌ అలీ, కార్యదర్శి వేల్పూరు రవి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జావిద్‌ అలీ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల సజావుగా నిర్వహణలో నాల్గవ తరగతి ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు. పదోన్నతులు, బదిలీలు, సేవా సంబంధిత అంశాలతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర సంఘం అధ్యక్షుడు దాస్య నాయక్‌ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతతో పాటు ఇతర హక్కుల సాధనకు అందరూ ఐక్యంగా ఉండి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్‌ షరీఫ్‌ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగులంతా సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

సహాయ అధ్యక్షులు కసిని శ్రీకాంత్‌, వెంకట్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్‌, ప్రమోద్‌, యాదవ్‌రెడ్డి, విజయ్‌తో పాటు పలువురు సంఘ నాయకులు, ప్రతినిధులు, నాల్గవ తరగతి ఉద్యోగులు సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని వారు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button