13న సంగారెడ్డికి గీతన్నల చైతన్య బస్సుయాత్ర
-అమరవీరుల స్మరణలో రాష్ట్రవ్యాప్త యాత్రకు ఘన స్వాగతం పలకాలి

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 11 (రథసారథి న్యూస్): అమరవీరుల స్మరణలో గీత కార్మికుల సమస్యలపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న గీతన్నల చైతన్య రాష్ట్ర బస్సుయాత్ర ఈనెల 13న సంగారెడ్డి జిల్లాకు చేరుకోనుందని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ తెలిపారు. యాత్రను విజయవంతం చేయడానికి జిల్లాలోని కల్లుగీత కార్మికులు, గౌడ సోదరులు, వృత్తి శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డిలోని ప్రజాసంఘాల భవన్లో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి రమేష్‌గౌడ్ మాట్లాడారు. మహబూబాబాద్‌లో ఈనెల 2న ప్రారంభమైన గీతన్నల చైతన్య బస్సుయాత్ర రాష్ట్రంలోని వివిధ జిల్లాల మీదుగా కొనసాగుతూ 13న సంగారెడ్డి జిల్లాకు చేరుకుంటుందని వారు తెలిపారు. నర్సాపూర్ నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి హత్నూర మండలం దౌల్తాబాద్‌కు చేరుకుని, అక్కడి నుంచి సంగారెడ్డికి ఉదయం 10 గంటలకు చేరుకుంటుందని వెల్లడించారు. సంగారెడ్డి పాత బస్టాండ్‌లోని హనుమాన్ విగ్రహం వద్ద బస్సుయాత్రకు భారీ ద్విచక్రవాహన ర్యాలీతో స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. అనంతరం పాపన్నగౌడ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. తర్వాత బైపాస్ రహదారిలోని ఎక్సైజ్ కార్యాలయం పక్కన ఉన్న నాల్గవ తరగతి ఉద్యోగుల భవన్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు జిల్లాలోని గీత కార్మికులు, గౌడ సోదరులు, వృత్తి శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
-గీత వృత్తికి రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించాలి
గీత కార్మికులకు, గౌడ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కల్లుగీత వృత్తి సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. వనమహోత్సవంలో భాగంగా ఈత, తాటి చెట్ల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టేలా గీత కార్మికుల్లో చైతన్యం కల్పించడమే బస్సుయాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గీత వృత్తి పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర ఈనెల 18వ తేదీ వరకు కొనసాగి హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ముగుస్తుందని నాయకులు తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు జంగన్నగౌడ్, సంగారెడ్డి మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశంగౌడ్, యాదగౌడ్, కృష్ణగౌడ్, రామాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.



