ఇస్నాపూర్ వద్ద వాహన రాకపోకలకు మళ్లింపు రెండు నెలలపాటు
-ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల మళ్లింపు

-సెప్టెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్న ట్రాఫిక్ ఆంక్షలు
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 23 (రథసారథి న్యూస్):
పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ కూడలి వద్ద జాతీయ రహదారి–65పై రెండో దశ వంతెన, వాహనాల దిగువ మార్గం నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వాహన రాకపోకలను మళ్లించనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిర్మాణ పనులు సజావుగా, సురక్షితంగా కొనసాగేందుకు ఈ మళ్లింపులను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇస్నాపూర్ కూడలి నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను పరిస్థితులకు అనుగుణంగా అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా..పటాన్‌చెరు నుంచి కంది, సంగారెడ్డి వైపు వెళ్లే వాహనాలు,
రామచంద్రాపురం, పటాన్‌చెరు వైపు నుంచి వచ్చే వాహనాలను నవాపన్ కూడలి వద్ద మళ్లించి కర్దనూర్ ఎక్స్ రోడ్డు – పారిశ్రామిక ప్రాంతం పాశమైలారం – ఇంద్రకరణ్ – కంది – సంగారెడ్డి మార్గంలో పంపించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మూడో నిష్క్రమణ నుంచి వచ్చే వాహనాలు,
సంగారెడ్డి వైపు వెళ్లే వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు మూడో నిష్క్రమణ సమీపంలోని ముత్తంగి సేవా రహదారి వద్ద మళ్లించి కర్దనూర్ ఎక్స్ రోడ్డు – పారిశ్రామిక ప్రాంతం పాశమైలారం – ఇంద్రకరణ్ – కంది – సంగారెడ్డి మార్గంలోకి మళ్లించనున్నారు.
ఈ మళ్లింపులు సెప్టెంబర్ 26, 2026 నుంచి రెండు నెలలపాటు కొనసాగనున్నాయి. అయితే అప్పటి రహదారి రద్దీ, నిర్మాణ పనుల పురోగతిని బట్టి అవసరాన్ని అనుసరించి మళ్లింపులను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకుని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. నిర్మాణ పనుల కారణంగా కలిగే అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.



