రాజీవ్‌గాంధీ ఆశయాల సాధనకు కృషి చేయాలి-డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 20 (రథసారథి న్యూస్): దేశాన్ని ఆధునికత వైపు నడిపించిన మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయమని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి ఐబీ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా దేశాభివృద్ధికి దూరదృష్టితో అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. ముఖ్యంగా సమాచార సాంకేతిక, టెలికాం, కంప్యూటర్ రంగాలకు ప్రాధాన్యం కల్పించి భారతదేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. యువతే దేశ భవిష్యత్తు అనే భావనతో వారికి రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత ప్రాధాన్యం కల్పించేందుకు రాజీవ్‌గాంధీ అనేక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించడం ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తరించిన చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి కోసం రాజీవ్‌గాంధీ చేసిన కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాజీవ్‌గాంధీ కలలుగన్న ఆధునిక, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్కిషన్, మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్‌గౌడ్, నాయకులు కూన సంతోష్, కౌన్సిలర్లు గడ్డం రాజు, రమేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
