Sangareddy

ప్రిన్సిపాల్‌ రూపా రెడ్డి హత్యను ఖండించిన మాస్టర్‌ మైండ్స్‌ కరస్పాండెంట్‌ నవనీత

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 20 (రథసారథి న్యూస్): నల్లగొండ జిల్లాలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న రూపా రెడ్డిని పదో తరగతి విద్యార్థులు హత్య చేసిన ఘటనను సంగారెడ్డిలోని మాస్టర్‌ మైండ్స్‌ ఈ-టెక్నో స్కూల్‌ కరస్పాండెంట్‌ నవనీత తీవ్రంగా ఖండించారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులే ప్రిన్సిపాల్‌పై హత్యకు పాల్పడటం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నవనీత మాట్లాడుతూ.. పిల్లలు క్రమశిక్షణతో, సత్ప్రవర్తనతో మెలుగుతున్నారా లేదా అన్న విషయాన్ని తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని సూచించారు. చిన్న వయసులోనే పిల్లలకు విచ్చలవిడిగా సెల్‌ఫోన్లు, అధిక మొత్తంలో డబ్బు, ద్విచక్ర వాహనాలు అందించడం సరికాదని అన్నారు. మొక్కై వంగనిది మానై వంగునా’ అనే సామెతను గుర్తు చేస్తూ.. చిన్నతనంలోనే పిల్లలకు క్రమశిక్షణ, సంస్కారం, మంచి విలువలను అలవర్చాలని సూచించారు.

తల్లిదండ్రులు పిల్లలకు తగినంత సమయం కేటాయించకపోవడం, వారు ఎవరితో కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి అలవాట్లకు లోనవుతున్నారు అనే విషయాలను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిసలై కొందరు విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని నవనీత ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా క్రమశిక్షణ, సంస్కారం, వ్యక్తిత్వ వికాసం, మానసిక దృఢత్వం, యోగా, నైతిక విలువలు వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి పిల్లలకు మంచి మార్గనిర్దేశం అందించినప్పుడే వారి ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని ఆమె ఆకాంక్షించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button