Sangareddy

ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్‌ ధ్వజం

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 20 (రథసారథి న్యూస్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి. సాగర్‌ డిమాండ్‌ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని విమర్శించారు.

ఉద్యోగాల భర్తీ చేపట్టే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట గురువారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టి. సాగర్‌ మాట్లాడుతూ పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో సుమారు పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశంగా భారత్‌ ఉన్నప్పటికీ, యువత సామర్థ్యాన్ని దేశాభివృద్ధికి వినియోగించుకునే దిశగా పాలకులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

నిరుద్యోగ సమస్యతో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా యువతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం విచారకరమన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు గడిచినా ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ అమలుకు నోచుకోలేదని సాగర్‌ ఆరోపించారు. ఉద్యోగాల కోసం యువత ప్రశ్నిస్తే పకోడీలు, బజ్జీలు విక్రయించడం కూడా ఉపాధి కల్పించడమేనని చెప్పడం పాలకుల వైఖరికి నిదర్శనమన్నారు.

‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో ప్రచారం తప్ప కొత్త ఉద్యోగాల కల్పన, నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ‘యూత్‌ డిక్లరేషన్‌’ హామీలను అమలు చేయడంలో కాలయాపన చేస్తోందని సాగర్‌ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 16 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

-పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల కోసం యువత లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నప్పటికీ తగిన అవకాశాలు లభించడం లేదన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్‌రావు, ప్రవీణ్‌, మహిపాల్‌, యాదగిరి, విద్యాసాగర్‌, కృష్ణ, నాయకులు అశోక్‌, రాజయ్య, రమేష్‌గౌడ్‌, రాజేష్‌, మహేష్‌, బాలరాజు, శ్రీనివాస్‌, నరసింహారెడ్డి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button