Sangareddy

జాతీయ లోక్‌ అదాలత్‌లో 3,625 కేసుల పరిష్కారం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 12 (రథసారథి న్యూస్):

కక్షిదారులు పరస్పర అంగీకారంతో తమ వివాదాలను సత్వరంగా పరిష్కరించుకునేందుకు లోక్‌ అదాలత్‌ చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ జి. భవాని చంద్ర అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో మూడో జాతీయ లోక్‌ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల సమయం, న్యాయ వ్యయం ఆదా కావడంతో పాటు ఇరుపక్షాలకు సంతృప్తికరమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. మొదటి అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయమూర్తి కె. జయంతి మాట్లాడుతూ రాజీకి వీలైన వివాదాలను లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. సత్వర న్యాయం అందించడంలో లోక్‌ అదాలత్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ అదాలత్‌లో సివిల్‌, రాజీకి వీలైన క్రిమినల్‌ కేసులు, చెక్కు బౌన్స్‌, మోటారు వాహన ప్రమాద పరిహారం, కుటుంబ వివాదాలు, బ్యాంకు రుణాల వసూళ్లు, సైబర్‌ నేరాలు, విద్యుత్‌ తదితర కేసులను పరిష్కరించారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,625 కేసులు పరిష్కరించగా, వాటిలో రాజీకి వీలైన క్రిమినల్‌ కేసులు 3,050, సివిల్‌ కేసులు 24, మోటారు వాహన ప్రమాద పరిహారం కేసులు 15, బ్యాంకు రుణాల వసూళ్ల కేసులు 230, సైబర్‌ నేరాల కేసులు 70, విద్యుత్‌ కేసులు 236 ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద పరిహారం కేసుల్లో రూ.1,56,85,000, బ్యాంకు రుణాల కేసుల్లో రూ.27,70,216, సైబర్‌ నేరాల కేసుల్లో రూ.3,37,606 మొత్తాలకు సంబంధించిన కేసులు పరిష్కరించబడ్డాయి.

పరిష్కరించిన కేసులకు సంబంధించి కక్షిదారులకు జి. భవాని చంద్ర అవార్డులను అందజేశారు. లోక్‌ అదాలత్‌ ద్వారా తమ కేసులు సత్వరంగా పరిష్కారం కావడం పట్ల కక్షిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించడం, ప్రజలకు సత్వర న్యాయం అందించడం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన లక్ష్యమని న్యాయమూర్తులు తెలిపారు.

కార్యక్రమంలో అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయమూర్తి డి. మాధవి కృష్ణ, అదనపు జిల్లా న్యాయమూర్తి సతీష్‌ కుమార్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య, ప్రధాన సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి డి.వి.ఆర్‌. తేజు కార్తీక్‌, అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థాన న్యాయమూర్తి కె. ధనలక్ష్మి, ప్రత్యేక మొబైల్‌ న్యాయస్థాన న్యాయమూర్తి టి. దుర్గా రాణి, ప్రత్యేక ఎక్సైజ్‌ న్యాయస్థాన న్యాయమూర్తి అమిసి జాజియాన్‌, సంగారెడ్డి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి. సంజీవరెడ్డి, ప్రభుత్వ న్యాయవాది జి. ప్రభు ధాన్యం, ప్రభుత్వ అభియోజకుడు సత్యనారాయణ, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య, ఆందోల్‌ ఆర్డీవో రాజు, న్యాయవాదులు, న్యాయస్థాన సిబ్బంది, పోలీసు అధికారులు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button