డ్రోన్ సాంకేతికత అభివృద్ధికి ఐఐటీ హైదరాబాద్–ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఒప్పందం
-ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ నగర అభివృద్ధికి సాంకేతిక సహకారం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 12 (రథసారథి న్యూస్): ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ నగరం, విస్తృత డ్రోన్ వ్యవస్థ అభివృద్ధికి సహకరించేలా ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ (ఏపీడీసీ), ఐఐటీ హైదరాబాద్కు చెందిన టిహాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఐఐటీ హైదరాబాద్ సంచాలకుడు ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఒప్పందం ప్రకారం టిహాన్–ఐఐటీ హైదరాబాద్ ఏపీడీసీకి సాంకేతిక, విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరిస్తుంది. డ్రోన్ నగర రూపకల్పన, ప్రణాళిక, అభివృద్ధి, నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, వ్యూహాత్మక సూచనలు అందిస్తుంది. డ్రోన్ల పరిశోధన, మానవరహిత వైమానిక వ్యవస్థలు, సెన్సర్లు, వివిధ పరికరాలు, కృత్రిమ మేధ, యంత్ర అభ్యాసం, స్వయంచాలక వ్యవస్థలు, సమాచార ప్రసార సాంకేతికత, డ్రోన్ రాకపోకల నిర్వహణ వంటి రంగాల్లో ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. అలాగే పరిశోధనా కార్యక్రమాలు, ప్రయోగాత్మక ప్రాజెక్టులు, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నాయి.
ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ సంచాలకుడు ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి మాట్లాడుతూ.. బలమైన డ్రోన్ వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఆవిష్కరణ రంగాల మధ్య సమన్వయం అవసరమన్నారు. ఈ ఒప్పందం ద్వారా పరిశోధకులు, నూతన సంస్థలు, పరిశ్రమలకు కొత్త అవకాశాలు ఏర్పడటంతో పాటు దేశంలో అధునాతన డ్రోన్ సాంకేతికత అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, నూతన సంస్థలు, విద్యార్థుల కోసం శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ధ్రువపత్ర కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించేందుకు కూడా ఈ భాగస్వామ్యం దోహదపడనుంది. సంయుక్త పరిశోధనలు, ప్రయోగాత్మక ప్రాజెక్టులు, నూతన ఆవిష్కరణల పోటీలు, ప్రాయోగిక కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో బలమైన డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇరు సంస్థలు ముందుకు సాగనున్నాయి.



