పీడిత వర్గాల గొంతుకగా నిలిచిన సీతారాం ఏచూరి
లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు విశేష కృషి

ప్రజా సమస్యలపై పార్లమెంటులోనూ, బయటా పోరాడిన మహానేత
-సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 12 (రథసారథి న్యూస్): పీడిత, అణగారిన వర్గాల హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ఆదర్శ నాయకుడు సీతారాం ఏచూరి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. దేశ రాజకీయాల్లో లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేయడంలో ఏచూరి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. సీపీఎం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సంగారెడ్డిలో సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సభ నిర్వహించారు.
తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చుక్క రాములు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు వేదికగా నిరంతరం పోరాడిన గొప్ప మేధావి ఏచూరి అని కొనియాడారు. లౌకిక విలువలు, సామాజిక న్యాయం, సమసమాజ స్థాపన కోసం తన జీవితాంతం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశారని తెలిపారు. పార్లమెంటులోనే కాకుండా ప్రజాక్షేత్రంలోనూ ప్రజా సమస్యలపై పోరాడిన యోధుడని అన్నారు.
మతోన్మాద ప్రమాదాన్ని ఎదుర్కొంటూ రాజ్యాంగ పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. నిరంతర అధ్యయనం ద్వారా మార్క్సిస్టు సిద్ధాంతంపై లోతైన అవగాహన పెంచుకున్న ఏచూరి, సమాజంలోని దోపిడీ, పీడనను రూపుమాపి సమసమాజ స్థాపనకు మార్క్సిజమే మార్గమని విశ్వసించారని చుక్క రాములు అన్నారు. ఆ సిద్ధాంతం ఆధారంగా ప్రజలను చైతన్యపరిచి అనేక ఉద్యమాలకు ప్రత్యక్షంగా నాయకత్వం వహించారని తెలిపారు.
విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పోరాటాల బాట పట్టిన ఏచూరి, అనంతరం దేశ రాజకీయాలను సమగ్రంగా అర్థం చేసుకుని కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా నిలిచారని పేర్కొన్నారు. దేశంలో మతోన్మాదం, కార్పొరేట్ శక్తుల ప్రభావం పెరుగుతున్న సమయంలో లౌకిక పార్టీలను ఏకం చేయడంలో, ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో ఆయన ముందువరుసలో ఉన్నారని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం, శ్రామిక రాజ్య సాధన కోసం నిరంతరం పోరాడటమే సీతారాం ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని చుక్క రాములు పేర్కొన్నారు. ఏచూరి స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లేశం, మాణిక్, సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, యాదగిరి, విద్యాసాగర్, రేవంత్, మహిపాల్, కృష్ణ, నాయకులు అశోక్, రమేష్‌గౌడ్, లక్ష్మి, మంజుల, సురేష్, బాలరాజు, శివకుమార్, దత్తు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.



