చదువు కొనసాగించాలనే తపనతో.. జగ్గారెడ్డికి భవాని అపురూప కానుక

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 12 (రథసారథి న్యూస్):
చదువుకోవాలనే తపనకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారడంతో ఆందోళనలో ఉన్న రాయికోడ్ మండలం కప్పాడ్ గ్రామానికి చెందిన విద్యార్థిని భవాని తన సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డిని కలిసింది. ఆయనను కలిసే సందర్భంగా తనకు చేతనైన కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో పది రోజులపాటు శ్రమించి ధారాలతో రూపొందించిన చిత్రపటాన్ని ఆయనకు అందజేసింది. కప్పాడ్ గ్రామానికి చెందిన భవాని స్థానిక నమూనా పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రస్తుతం లెక్కల నిపుణుల వృత్తికి సంబంధించిన కోర్సు చదువుతోంది. మొదటి స్థాయి పూర్తి చేసిన ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా గత ఆరు నెలలుగా చదువుకు దూరంగా స్వగ్రామంలో ఉంటోంది.
భవాని కుటుంబానికి రెండున్నర ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమి గత 12 ఏళ్లుగా వివాదంలో ఉండటంతో విక్రయించలేని పరిస్థితి నెలకొంది. సమస్య రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్లో ఉండటంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరోవైపు అక్క వివాహం, తన చదువు కొనసాగింపు వంటి బాధ్యతలకు ఆ భూమే కుటుంబానికి ప్రధాన ఆధారం. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చదువు మానేయాలని తండ్రి సూచించినప్పటికీ శివాని తన విద్యను మధ్యలో నిలిపివేయడానికి ఇష్టపడలేదు. భూమి సమస్య పరిష్కారమైతే వచ్చే ఆదాయంతో తిరిగి చదువును కొనసాగించవచ్చని భావించింది. తన సమస్యను పరిష్కరించేందుకు జగ్గారెడ్డి సహకరిస్తారనే నమ్మకంతో ఆయనను కలవాలని నిర్ణయించుకుంది.
చిన్నప్పటి నుంచే చిత్రకళపై ఆసక్తి ఉన్న భవాని, జగ్గారెడ్డికి ప్రత్యేకమైన కానుక ఇవ్వాలని భావించి ధారలతో చిత్రపటాన్ని రూపొందించే కళను నేర్చుకుంది. అనంతరం పది రోజులపాటు శ్రమించి జగ్గారెడ్డి చిత్రపటాన్ని తయారు చేసింది. గ్రామానికి చెందిన పరిచయస్తుల సహకారంతో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చేర్యాల ఆంజనేయులు, చిమ్నాపూర్ ప్రకాష్, పాస్టర్ మోజెస్ను సంప్రదించిన శివాని శనివారం తల్లిదండ్రులతో కలిసి జగ్గారెడ్డిని కలిసింది. తాను రూపొందించిన చిత్రపటాన్ని ఆయనకు అందజేసింది. భవాని పరిస్థితిని తెలుసుకున్న జగ్గారెడ్డి ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
భూమి వివాదాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చదువు మధ్యలో ఆగిపోకుండా లక్ష్యాన్ని చేరుకోవాలని శివానిని ప్రోత్సహించారు. చిత్రపటం అందించేందుకు వెళ్లిన శివాని.. తన భవిష్యత్తుకు భరోసాతో తిరిగి రావడం ఈ కలయికకు ప్రత్యేకతను సంతరించుకుంది.



