ఘనంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 15 (రథసారథి న్యూస్):
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వినాయక మండపాల్లో నిర్వహించిన తొలి రోజు పూజా కార్యక్రమాల్లో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామ్‌నగర్‌లోని రామ్‌మందిర్ వద్ద ఉత్సవాలు ప్రారంభం కాగా, జగ్గారెడ్డి స్వయంగా భజన చేస్తూ భక్తులతో కలిసి వీధుల గుండా ఊరేగింపుగా బ్రాహ్మణవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి మట్టి గణపతి విగ్రహాన్ని తీసుకువచ్చి రామ్‌మందిర్‌లో ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్ఠించారు. అనంతరం గంజి మైదాన్‌లో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో, భరత్ సాయి రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన మండపంలో జయారెడ్డి, గుణ చైతన్య రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రామ్‌మందిర్ యువసేన సభ్యుడు దత్తు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోనూ జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ అధ్యక్షతన చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూన సంతోష్ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బైపాస్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భరత్ సాయి రెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో భరత్ సాయి రెడ్డి, ఆయన కాబోయే సతీమణి పాలక్ పటేల్ ఆధ్వర్యంలో తొలి రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి ప్రజలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో జయారెడ్డి, గుణ చైతన్య రెడ్డి దంపతులు, కాబోయే వధూవరులు భరత్ సాయి రెడ్డి–పాలక్ పటేల్, నిర్మలా జగ్గారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



