అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 15 (రథసారథి న్యూస్):
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించే విధంగా పుస్తకం రచిస్తున్నారని ఆరోపిస్తూ హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మునిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దాపురం దుర్గయ్య మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే, పుస్తకాలు రాసే స్వేచ్ఛ కల్పించిందని, అయితే ఇతరుల గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
దేశంలోని అణగారిన, బలహీన వర్గాలతో పాటు ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం కల్పించడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మహిళలకు పురుషులతో సమాన హక్కులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వంటి అనేక అంశాల్లో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. అటువంటి మహనీయుడిని ‘కల్పిత నాయకుడు’గా పేర్కొంటూ పుస్తకం రచించడం బాధాకరమని అన్నారు.
అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం, హక్కులు, రక్షణలు, సామాజిక న్యాయ సూత్రాలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని పేర్కొన్నారు. హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి బిట్టు వసంత్‌కుమార్, మునిపల్లి మండల ప్రధాన కార్యదర్శి వీరయ్య, పీజీహెచ్‌ఎం కోల్ తుకారాం, పీజీహెచ్‌ఎం పెద్దగోపులారం భాస్కర్, ఉపాధ్యాయులు సాయిబాబా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


