
-పోరాట చరిత్రను భావితరాలకు అందించాలి
-సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.ప్రకాశ్‌రావు
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 13 (రథసారథి న్యూస్): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిస్వార్థంగా సాగిన మహత్తర పోరాటమని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన ఈ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి. ప్రకాశ్‌రావు అన్నారు. సంగారెడ్డిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటూ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
నిజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో 1946 నుంచి 1951 వరకు చారిత్రాత్మక రైతాంగ పోరాటం సాగిందన్నారు. హైదరాబాద్ సంస్థానంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ప్రజలపై అనేక రకాల పన్నులు విధించడంతో పాటు, అణచివేతకు పాల్పడ్డారని ఆరోపించారు. మహిళలను సైతం చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. వెట్టిచాకిరీ పేరుతో ప్రజలను దోచుకోవడం, రైతులు పండించిన పంటలను పన్నుల రూపంలో కొల్లగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీ ప్రజలను చైతన్యపరిచి పోరాటాలకు నాయకత్వం వహించిందన్నారు.
ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరిచినట్లు తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా పేదలకు సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీదని అన్నారు. ఈ పోరాటంలో సుమారు 4 వేల మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారని, 3 వేల గ్రామాల్లో ప్రజా స్వపరిపాలన ఏర్పాటైందని పేర్కొన్నారు.
వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటం దేశవ్యాప్తంగా అనేక సంస్థానాల విలీనానికి దోహదపడిందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన అనేక ప్రజా పోరాటాలకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తిగా నిలిచిందని, నేటి తరానికి కూడా ఈ పోరాట చరిత్ర ఆదర్శంగా నిలుస్తుందని ప్రకాశ్‌రావు పేర్కొన్నారు. అనంతరం అమరవీరుల స్థూపాలు, పార్టీ దిమ్మెల వద్ద ఎర్రజెండాలను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి సయ్యద్ జలాల్ రెహమాన్, తాజొద్దీన్, షఫీ, విష్ణు శంకరప్ప, పాండు, సాదిక్ అలీ, బుజమ్మ, గంగమ్మ, సత్యమ్మ, పూలమ్మ, లడ్డు లక్ష్మి, సరస్వతి, సంగీత తదితరులు పాల్గొన్నారు.

