మట్టి గణపతిని పూజించడం ప్రకృతి పరిరక్షణకు ప్రతీక-మహేశ్వర శర్మ సిద్ధాంతి

-5,250 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 13 (రథసారథి న్యూస్): పర్యావరణ పరిరక్షణతో పాటు సనాతన ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంగారెడ్డిలోని వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పట్టణంలోని ఐబీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది 5,250 మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు అందజేయడం గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రకృతి నుంచి లభించే సహజ పదార్థాలతో గణనాథుడి ప్రతిమను రూపొందించి పూజించడం సనాతన ధర్మంలో భాగమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
మట్టి గణనాథుల పంపిణీ కార్యక్రమం ప్రజల్లో భక్తిభావంతో పాటు ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంచుతోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి గణేశ్వరుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాశ్, ఉపాధ్యక్షుడు మ్యాడం రాధాకిషన్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, సభ్యులు చందా శ్రీధర్, ఇరుకుల ప్రదీప్‌కుమార్, జూలకంటి రామకృష్ణ, వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అనుముల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



