విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలంటే సౌర విద్యుత్ వినియోగించాలి
సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి

-సంగారెడ్డిలో భారత్ ఈవీ సోలార్ లిమిటెడ్ శాఖ కార్యాలయం ప్రారంభం
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 13 (రథసారథి న్యూస్): పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రజలు విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన భారత్ ఈవీ సోలార్ లిమిటెడ్ శాఖ కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం గృహ, వాణిజ్య అవసరాలకు విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో సౌర విద్యుత్ వ్యవస్థలను వినియోగించడం ద్వారా విద్యుత్ వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే వారికి నిబంధనల మేరకు రాయితీ సౌకర్యాలను కల్పిస్తున్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సౌర విద్యుత్ వినియోగంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ ఈవీ సోలార్ లిమిటెడ్ ద్వారా గృహ అవసరాలకు అనుగుణంగా ఒక కిలోవాట్ నుంచి పది కిలోవాట్ల వరకు వివిధ సామర్థ్యాల సౌర విద్యుత్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని సంస్థ పంపిణీదారులు ప్రసాద్, కళ్యాణ్ తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయితీకి అర్హులైన వినియోగదారులకు తగిన ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొన్నారు. సంగారెడ్డిలో శాఖ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజలకు సౌర విద్యుత్ వ్యవస్థలపై అవగాహన, సలహాలు, అవసరమైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, పంపిణీదారులు, సంగారెడ్డి మున్సిపల్ ఉపాధ్యక్షుడు షఫీ హఫీజ్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



