Sangareddy

సాయి ఎన్‌క్లేవ్ – సాయి కృషి నగర్‌లో వైభవంగా గణేష్ నవరాత్రి ముగింపు

నిమజ్జనోత్సవానికి పోటెత్తిన భక్తజనం.. భజనలు, కీర్తనలు, నృత్యాలతో హోరెత్తిన సందడి

సంగారెడ్డి ప్రతినిధి, రథసారథి:
భక్తి ఉప్పొంగింది.. భక్తజనం కదిలివచ్చారు.. జై గణేష్ నినాదాలతో సాయి ఎన్‌క్లేవ్ – సాయి కృషి నగర్ మార్మోగింది! గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ఘన నిమజ్జనోత్సవంలో వందలాది మంది కాలనీ వాసులు, మహిళలు, చిన్నారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. భజనలు, కీర్తనలు, నృత్యాలతో సాగిన నిమజ్జన వేడుకలు రాత్రి వరకు ఉత్సాహంగా కొనసాగాయి.

నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు, భజనలు, కీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. చివరి రోజు నిమజ్జన కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలతో సందడి చేయడంతో కాలనీ మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ఉత్సాహం

ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గణేష్ లడ్డూ వేలంలో భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఒక లడ్డూతో పాటు వెండి గణేష్ నాణెం అందించే టోకెన్ విధానం నిర్వహించారు. మరో లడ్డూ రూ.42,000కు, ఇంకొక లడ్డూ రూ.1,28,000కు వేలం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.

భక్తి, సంస్కృతి, వినోదం, సామాజిక ఐక్యతను కలగలిపిన ఈ వేడుకలు రాత్రి వరకు ఘనంగా కొనసాగాయి. నవరాత్రులంతా నిర్వాహకులు, కాలనీ సభ్యుల సమష్టి కృషితో నిర్వహించిన కార్యక్రమాలకు నిమజ్జనోత్సవంతో ఘన ముగింపు పలికారు. ఉత్సవాలను విజయవంతం చేసిన నిర్వాహకులు, సహకరించిన ప్రతి ఒక్కరిని కాలనీ వాసులు అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button