Sangareddy

లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు

-పీసీ–పీఎన్‌డీటీ చట్టంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 20 (రథసారథి న్యూస్): గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను అరికట్టడంతో పాటు పీసీ–పీఎన్‌డీటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కే. లలితాదేవి అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న స్కానింగ్‌ కేంద్రాల పనితీరు, పీసీ–పీఎన్‌డీటీ చట్టం అమలు తీరు, రికార్డుల నిర్వహణ, గర్భిణులకు అందుతున్న వైద్య సేవలు, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధానికి సంబంధించిన నిబంధనలపై అధికారులు సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లలితాదేవి మాట్లాడుతూ గర్భస్థ శిశువు లింగాన్ని నిర్ధారించడం, వెల్లడించడం లేదా అందుకు ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.

ప్రతి స్కానింగ్‌ కేంద్రం పీసీ–పీఎన్‌డీటీ చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఆమె కోరారు. మహిళలు, శిశువుల సంరక్షణతో పాటు బాలికల భద్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీసీ–పీఎన్‌డీటీ సంబంధిత అధికారులు, డెమో డాక్టర్‌ ప్రవీణ్‌, వనజారెడ్డి, డాక్టర్‌ రాజుగౌడ్‌, డాక్టర్‌ శైలజ, డాక్టర్‌ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button