Uncategorized

వైద్య కళాశాల, జీజీహెచ్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం

రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి..

-ఈ నెల 17న నర్సింగ్‌ కళాశాల, వసతి గృహం, క్రీడా సముదాయం ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి..

-సింగూర్‌ కాలువల పనులు వేగవంతం చేయాలి

-మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్‌ 2 (రథసారథి న్యూస్): జిల్లాలో వైద్య, ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌తో కలిసి వైద్య, ఆరోగ్యశాఖ, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌), ప్రభుత్వ వైద్య కళాశాల, సంగారెడ్డి, జోగిపేట నర్సింగ్‌ కళాశాలలు, రహదారులు–భవనాలు, నీటిపారుదల శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, పరికరాల లభ్యత, నిర్వహణ, పెండింగ్‌ పనులు, భవిష్యత్‌ అవసరాలపై సమగ్రంగా సమీక్షించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, బాలికలు, బాలుర వసతి గృహాల్లో వసతులు, పరికరాలు, అదనంగా చేపట్టాల్సిన పనులపై కళాశాల ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం సాగించేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జీజీహెచ్‌లో వైద్య పరికరాల పనితీరు, భవన నిర్వహణ, రోగుల సంరక్షణ, పారిశుద్ధ్యం, భద్రత, ఘన వ్యర్థాలు, జీవ వైద్య వ్యర్థాల నిర్వహణపై సూపరింటెండెంట్‌ మురళీకృష్ణను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రి, వైద్య కళాశాల, వసతి గృహాల వార్షిక నిర్వహణ అవసరాలను గుర్తించి, ప్రాధాన్యతా క్రమంలో పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత సంస్థలను ఆదేశించారు. అన్ని నిర్వహణ సంస్థలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆసుపత్రిలోని ప్రతి వైద్య పరికరం వివరాలు, పనితీరు, వినియోగం, మరమ్మతులు, అదనంగా అవసరమైన పరికరాలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచాలని, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన పరికరాల వివరాలను తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు నిరంతరాయంగా, నాణ్యతా ప్రమాణాలతో అందించాలని స్పష్టం చేశారు.

వైద్య కళాశాల ఆడిటోరియం నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. సంగారెడ్డి, జోగిపేట నర్సింగ్‌ కళాశాలల అభివృద్ధి పనులు, వసతి గృహాల పురోగతి, విద్యార్థుల సంఖ్య, బోధనా సిబ్బంది, పరికరాలు, వసతి సౌకర్యాలపై సంబంధిత ప్రిన్సిపాళ్లతో సమీక్షించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, పరికరాలు, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ నెల 17న సంగారెడ్డి నర్సింగ్‌ కళాశాల, నర్సింగ్‌ వసతి గృహం, వైద్య కళాశాల క్రీడా సముదాయాన్ని ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి తదితర వైద్య సంస్థలపైనా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ లలితాదేవితో మంత్రి సమీక్షించారు. మిగిలిన చిన్నచిన్న పనులు, పరికరాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఇతర అవసరాలను వెంటనే పూర్తి చేసి ఈ నెలాఖరులోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం సింగూర్‌ ప్రాజెక్టు పరిధిలోని కాలువల లైనింగ్‌, కట్టల మరమ్మతులు, ప్రాజెక్టులోకి వస్తున్న నీటి ప్రవాహం, నీటి నిల్వలు, మృత నిల్వ, సగటు నీటిమట్టం, నిల్వ సామర్థ్యం, పూర్తయిన పనులు, అవసరమైన నిధులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు.

కాలువల లైనింగ్‌, కట్టల మరమ్మతు పనులను ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖకు చెందిన ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు చేపట్టి సంరక్షించాలని సూచించారు. కాలువల పరిరక్షణ కోసం అవసరమైన చోట పోలీసు ఔట్‌పోస్ట్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. కాలువల అభివృద్ధి పనులు, అవసరమైన నిధులు, భవిష్యత్‌ కార్యాచరణపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని, నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. అన్ని అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పాండు, సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ లలితాదేవి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మురళీకృష్ణ, వైద్య, నర్సింగ్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల శాఖల అధికారులు, సంబంధిత సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button