ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి
-సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు

-ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి.. అవసరమైతే అభ్యంతరాలు, దావాలు దాఖలు చేయాలి
-జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్ జైన్
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (రథసారథి న్యూస్): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను అర్హులైన ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్ జైన్ సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తొలి దశ, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో రెండో దశ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ తేదీల్లో ఓటర్లు తమకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు.
జాబితాలో పేరు నమోదు చేయాల్సి ఉన్నా, పేరు తొలగించాల్సి ఉన్నా, వ్యక్తిగత వివరాల్లో మార్పులు లేదా సవరణలు అవసరమైనా సంబంధిత ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా దరఖాస్తులు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమాల సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) కూడా హాజరై ముసాయిదా ఓటరు జాబితా పరిశీలనలో సహకరించాలని సూచించారు.
బీఎల్ఓలు, బీఎల్ఏల సమక్షంలో ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, తప్పులు లేదా మార్పులు అవసరమైన వివరాలను గుర్తించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సవరణలు చేపట్టాలని తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ కాలంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఫారం-6, 7, 8 అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని తన ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైన సవరణలు లేదా అభ్యంతరాలను నిర్ణీత గడువులో దాఖలు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు.



