Sangareddy

సంగారెడ్డిలో సీఎం సభకు భారీ ఏర్పాట్లు

-లక్ష మందితో బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్‌ సన్నాహాలు

సభ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి సమీక్ష

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 11 (రథసారథి న్యూస్): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 15న సంగారెడ్డిలో పాల్గొననున్న బహిరంగ సభను భారీ జన సమీకరణతో విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతోంది. సుమారు లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జగ్గారెడ్డితో పాటు సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్‌ చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి, పలువురు అధికారులు హాజరయ్యారు.

మంత్రి దామోదర రాజనర్సింహ వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నందున సమావేశానికి హాజరు కాలేకపోయారు. సభా ప్రాంగణం, వేదిక, ప్రజల రాకపోకలు, భద్రత, తాగునీరు, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డికి చేరుకుని సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడే ఉంటారని నాయకులు వెల్లడించారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

-పది మందికి సీఎం చేతుల మీదుగా స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభలో మరో కీలక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేసిన పది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభా వేదికపైనే కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందజేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌కు సూచించారు. ముఖ్యమంత్రి సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని, భారీ జన సమీకరణతో సభను విజయవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి పార్టీ శ్రేణులకు, అధికారులకు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button