Sangareddy

శిశు గృహం, జువైనల్ జస్టిస్ బోర్డు, సఖి కేంద్రాలను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

-పిల్లల సంరక్షణ, భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి – బి. సౌజన్య

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 10 (రథసారథి న్యూస్):- జాతీయ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానిచంద్ర ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య గురువారం సంగారెడ్డిలోని శిశు గృహం, జువైనల్ జస్టిస్ బోర్డు, సఖి కేంద్రాలను సందర్శించారు. శిశు గృహాన్ని సందర్శించిన సందర్భంగా పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, భద్రత, విద్య, వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి బాగోగులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

శిశు గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పిల్లలు క్రమశిక్షణతో ఉండేలా అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు. పిల్లల సంక్షేమం విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం సఖి కేంద్రాన్ని సందర్శించిన ఆమె, కేంద్రానికి వచ్చే బాధితుల సమస్యలను సానుభూతితో విని, వారికి అవసరమైన న్యాయ, ఇతర సహాయ సహకారాలను అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భార్యాభర్తల మధ్య తలెత్తే కుటుంబ సమస్యలను కౌన్సిలింగ్ ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు.

బాధితులకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించి, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జువైనల్ జస్టిస్ బోర్డును సందర్శించి,బాలల హక్కుల పరిరక్షణ, బాల న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. తెలిసీ తెలియక జరిగిన తప్పులు, నేరాల కారణంగా భవిష్యత్తుదెబ్బతినకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని, తిరిగి నేరాలకు పాల్పడకుండా మంచి ప్రవర్తనతో ముందుకు సాగాలని బాలలకు సూచించారు. ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు సంగారెడ్డిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించడంతో పాటు టోల్‌ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి న్యాయ సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కే. ధనలక్ష్మి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button