వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళి

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 10 (రథసారథి న్యూస్): జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు జి. అంజయ్య, కార్యదర్శి ఎం. మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం గడీల పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని వారు కొనియాడారు. భూస్వామ్య దోపిడీ, నిరంకుశత్వానికి ఎదురొడ్డి పేదలు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఐలమ్మ చూపిన తెగువ, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి అంజయ్య, అల్లాపూర్ సర్పంచ్, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొని ఐలమ్మకు నివాళులర్పించారు.



