ఎస్పీకి మట్టి వినాయక విగ్రహం అందజేత

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 10 (రథసారథి న్యూస్): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌వీ నాయకులు అఖిల్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పరితోష్ పంకజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. వినాయక చవితి వేడుకల్లో రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించాలని అఖిల్ సూచించారు.
మట్టి విగ్రహాల వినియోగం ద్వారా నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి, పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మట్టి వినాయక విగ్రహాన్ని స్వీకరించి, పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసద్, అడ్నాన్, సబీల్ తదితరులు పాల్గొన్నారు.



