సంగారెడ్డిలో ట్రాఫిక్ కష్టాలు..!

-విద్యానగర్ రోడ్ నెం.3లో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం
-ప్రమాదాలకు దారి తీస్తున్న ఫుట్‌పాత్ ఆక్రమణలు
-ఫుట్‌పాత్ ఆక్రమణలు పార్కింగ్‌తో వాహనదారుల అసహనం
– ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం కోరుతున్న ప్రజలు
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 24 (రథసారథి న్యూస్):
జిల్లా కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలంగా మారుతోంది. వాహనాల సంఖ్య భారీగా పెరగడం, రోడ్ల విస్తరణ పనులు నత్తనడకన సాగడం, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, రోడ్లపైనే అక్రమ పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణలో లోపాలు కలిసి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఉదయం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ప్రారంభ సమయాల్లో, సాయంత్రం కార్యాలయాలు ముగిసే వేళల్లో ప్రధాన రహదారులు పూర్తిగా ట్రాఫిక్‌తో కిక్కిరిసి నిత్యం నరకయాతనను తలపిస్తున్నాయి.
స్థానికులతో పాటు హైదరాబాద్, జహీరాబాద్, మెదక్, సదాశివపేట, నారాయణఖేడ్ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలన్నీ సంగారెడ్డి మీదుగానే ప్రయాణిస్తుండటంతో ట్రాఫిక్ ఒత్తిడి మరింత పెరుగుతోంది. సంగారెడ్డి చౌరస్తాలో అన్ని వైపులా ఫ్రీ లెఫ్టులు ఉన్న దగ్గర రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేసి దుకాణదారులు ఫుత్పాతులను ఆక్రమించడంతో ఫ్రీ లెఫ్ట్ లన్ని మూసుకొని పోయి కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. హైదరాబాద్ బాదువైపు వెళ్లే ఫ్రీ లెఫ్ట్ ఆక్రమించడంతో సిగ్నల్ పడినప్పుడు వాహనాలన్నీ ఒకవైపు పూర్తిగా నిలిచిపోతున్నాయి.
అదేవిధంగా సంగారెడ్డి లోపలికి వచ్చే కింగ్స్ హోటల్ ముందు వాహనాలు ఆటో పార్కింగ్లు అక్కడే ఉండడంతో తరచూ ప్రమాదాలు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. చిన్న ప్రమాదం జరిగినా లేదా ఏదైనా వాహనం రోడ్డుమధ్యలో నిలిచిపోయినా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించే పరిస్థితి నెలకొంటోంది. సంగారెడ్డి ప్రధాన చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ఉన్న రహదారి పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే మార్గం. ఇరువైపులా ఫుట్‌పాత్‌లను వ్యాపారులు ఆక్రమించుకోవడం, దుకాణాల ముందు రోడ్డుపైనే ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
వారం సంత జరిగే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పాదచారులు రోడ్డుపైనే నడవాల్సి వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం పెరుగుతోంది. ఇటీవల మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించినప్పటికీ, కొద్దిరోజుల్లోనే మళ్లీ యథాతథ స్థితి నెలకొనడం విమర్శలకు తావిస్తోంది.
-విద్యానగర్ రోడ్ నెం.3లో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం
వంటిల్లు రెస్టారెంట్ నుంచి మల్కాపూర్–చింతల్ చౌరస్తా వరకు వెళ్లే విద్యానగర్ రోడ్ నంబర్–3 కూడా ట్రాఫిక్‌కు కేంద్రబిందువుగా మారింది. ఈ మార్గంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ క్యాంపు కార్యాలయం ఉండటంతో అధికారుల రాకపోకలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా అపార్ట్‌మెంట్లు అక్రమ వాహనాల పార్కింగ్, నివాస సముదాయాలు, ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు అధికంగా ఉండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వందలాది వాహనాలు ఒకేసారి రోడ్డుపైకి వస్తున్నాయి.
రోడ్డుపై చిరు వ్యాపారులు, ఫుట్పాత్లను ఆక్రమించి వాహనాలను పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్‌కు ఆటంకంగా మారుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఒకసారి ట్రాఫిక్ నిలిచిపోతే ప్రజలు గంటల తరబడి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పనివేళల్లో ఉదయం సాయంత్రం పలువురు వాహనదారులు ఈ రోడ్డు గుండా రావాలంటే అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులు కేవలం చౌరస్తా ప్రధాన రహదారులపై కాకుండా రోడ్ నెంబర్ త్రీ ని కూడా పర్యవేక్షించి అక్రమ పార్కింగ్లను తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని పలువురు కాలనీవాసులు కోరుతున్నారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డులో పాఠశాలలు ప్రారంభం, ముగింపు సమయాల్లో స్కూల్ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, లారీలు, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు ఒకేసారి రావడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
వాహనాలు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఢీకొన్నప్పుడు ప్రమాదవశాత్తు దిగబడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ లేకపోవడం, సిగ్నలింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల చిన్న అవాంతరమే పెద్ద ట్రాఫిక్ సమస్యగా మారుతోంది. అతివేగంతో వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పక వాహనాల నియంత్రణకు రద్దీ వేళల్లో ట్రాఫిక్ పోలీసులు ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
-ప్రమాదాలకు దారి తీస్తున్న ఫుట్‌పాత్ ఆక్రమణలు
పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న ఫుట్‌పాత్‌లను చిరు వ్యాపారులు ఆక్రమించుకోవడంతో పాదచారులు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు దుకాణాల ముందు అక్రమ పార్కింగ్, రోడ్లపైనే సరుకు లోడింగ్–అన్‌లోడింగ్ చేయడం ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకంగా మారుతోంది.
ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసుల సంఖ్యను పెంచడంతో పాటు, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను శాశ్వతంగా తొలగించాలని, రహదారులపై అక్రమ పార్కింగ్‌ను కఠినంగా నియంత్రించాలని సూచిస్తున్నారు.
రద్దీ సమయాల్లో అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడంతో పాటు పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్ ప్రాంతాల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న రహదారి విస్తరణ పనులను వేగంగా పూర్తి చేసి వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.



