Uncategorized

యూపీఎస్సీ–2027 ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు దరఖాస్తుల గడువు రేపటితో ముగింపు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 (ప్రిలిమ్స్–కమ్–మెయిన్స్) ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 7 చివరి తేదీ అని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ. జగదీష్ తెలిపారు.

ఈ కోచింగ్‌కు మొత్తం 150 మంది అభ్యర్థులకు ప్రవేశం కల్పించనున్నారు. వీరిలో 100 మందిని ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనుండగా, గతంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన 50 మంది అర్హులైన అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష లేకుండానే నేరుగా ప్రవేశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5,000 స్టైపెండ్ (హాజరు నిబంధనలకు లోబడి), ఒకసారి రూ.5,000 పుస్తక నిధి, గ్రంథాలయ సౌకర్యం, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ, సబ్జెక్టుల వారీగా పరీక్షలు, మూల్యాంకనం, మెరుగుదల సూచనలు అందజేయబడతాయని తెలిపారు.

అర్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఎటువంటి ఉద్యోగంలో ఉండరాదు. ఇతర విద్యా కోర్సులు అభ్యసిస్తూ ఉండకూడదు. ఇతర ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా ఇలాంటి ఉచిత కోచింగ్ పొందకూడదు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగి ఉండాలి. ఆదాయ పరిమితి ప్రకారం గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలలోపు, పట్టణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు ఉండాలి.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ – ఆగస్టు 7, 2026
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ – ఆగస్టు 13 నుంచి
స్క్రీనింగ్ పరీక్ష – ఆగస్టు 16
ఫలితాల వెల్లడి – ఆగస్టు 19
ధ్రువపత్రాల పరిశీలన – ఆగస్టు 21 నుంచి
తరగతుల ప్రారంభం – ఆగస్టు 24 అర్హత, ఆసక్తి కలిగిన సంగారెడ్డి జిల్లా అభ్యర్థులు

www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆగస్టు 7లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం 08455-277015, 9494390803 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని, లేదా సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని వెలుగు ఆఫీస్ క్యాంపస్‌లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button