అభివృద్ధిపై చర్చకు రండి.. చింతా ప్రభాకర్‌కు కాంగ్రెస్ సవాల్
-జగ్గారెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక

+పలు భూ వ్యవహారాలపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 11 (రథసారథి న్యూస్): సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగ్గారెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించిన వారు.. తమ వద్ద ఉన్న అంశాలపై ఎమ్మెల్యే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. అభివృద్ధి, భూ వ్యవహారాలు, ప్రజా సమస్యలపై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సంగారెడ్డిలో నిర్వహించిన సభ విజయవంతమైన నేపథ్యంలో అప్పటి బీఆర్ఎస్ నాయకత్వం జగ్గారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్న అంశంపై చింతా ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. చింతా ప్రభాకర్ కుటుంబానికి సంబంధించిన భూముల వ్యవహారాలపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. సీలింగ్ భూముల రిజిస్ట్రేషన్లు, దళితుల భూముల అంశం, సదాశివపేటలో రహదారుల ఆక్రమణలు, మాలకుంట ప్రాంతానికి సంబంధించిన భూ వ్యవహారాలపై ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో మహిళా కౌన్సిలర్ల పట్ల ఆయన వ్యవహరించిన తీరుపైనా వివరణ ఇవ్వాలని అన్నారు.
-ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం
సదాశివపేటలోనే కాకుండా నియోజకవర్గంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. చింతా ప్రభాకర్ సమయం, ప్రదేశం నిర్ణయిస్తే అక్కడికి వచ్చి చర్చిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలకు సంబంధించిన అంశాలను ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకొస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి విషయంలోనూ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు.
ఐఐటీ హైదరాబాద్ ఏర్పాటు, ఇంటింటికీ మంజీరా నీటి సరఫరా, సంగారెడ్డి–లింగంపల్లి నాలుగు వరుసల రహదారి, ప్రభుత్వ పాలిటెక్నిక్, వ్యవసాయ, పీజీ కళాశాలల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో జగ్గారెడ్డి పాత్ర ఉందని తెలిపారు. కరోనా విపత్కర సమయంలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి జగ్గారెడ్డి నిరంతరం కృషి చేశారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉందన్నారు. అభివృద్ధిపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లె సత్యనారాయణ, కూన సంతోష్, షఫీ హఫీజ్, కిరణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



