పెండింగ్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్):
పెండింగ్‌లో ఉన్న రూ.10,500 కోట్ల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ నుంచి సుమారు 2,000 మంది విద్యార్థులతో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేసే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న రూ.10,500 కోట్ల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలపై ఆధారపడి ఉన్న పేద విద్యార్థులు చదువులు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. గతంలో అమలు చేసిన విధానంలోనే విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. పాఠశాలలను మూసివేయడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు, అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించకుండా వాటిని మూసివేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని శ్రీకాంత్ హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.డి. ఇస్మాయిల్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాల్, సునీల్, మహేష్, కరణ్, సల్లు, వీరమణి, ఐశ్వర్య, రేణుక, బాలాజీ, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.



