జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (రథసారథి న్యూస్):
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 08:45 గంటలకు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసు సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాతృభూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి సాధించిన స్వాతంత్ర్యాన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వేచ్ఛను, భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ తెలిపారు. దేశ భద్రతలో సరిహద్దుతో పాటు అంతర్గత భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పోలీసులుగా మన పాత్ర అత్యంత కీలకమని అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలు మన విధులు, సమాజానికి అందించాల్సిన సేవలను గుర్తు చేసే వేడుకలని, భిన్న భాషలు, జాతులు, మతాల సమ్మిళితం మన భారతదేశం అని, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలున్న వ్యక్తులు మరియు సమూహాల మధ్య సామరస్యం, ఐక్యత భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమ విధులను నిబద్ధతతో, అంకితభావంతో, నిజాయితీగా నిర్వర్తిస్తే సరిహద్దుల్లో సేవలందిస్తున్న సైనికుల త్యాగాలకు సమానంగా మన సేవలు నిలుస్తాయని గుర్తుచేశారు.
పోలీసు సిబ్బంది కూడా అదే ధృఢ సంకల్పంతో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీసు సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్య గౌడ్, ఎఆర్. డిఎస్పీ ఎ.నరేందర్, యస్.బి. ఇన్స్పెక్టర్స్ సదా నాగరాజు, డి.సి.ఆర్.బి. ఇన్స్పెక్టర్ రమేష్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆర్.ఐ. లు సురేష్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, యస్.బి.,డి.సి.ఆర్.బి. యస్.ఐ. లు, సిబ్బంది పాల్గొన్నారు.



