కలెక్టరేట్ ప్రజావాణిలో 39 వినతులు స్వీకరణ-అడిషనల్ కలెక్టర్ పాండు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 17 (రథసారథి న్యూస్):
ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదు, వినతిని సత్వరమే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ పాండు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ , పాండు ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణిలో అందిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జిల్లాలో మండల స్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజావాణిలో జిల్లావ్యాప్తంగా మొత్తం 56 ఫిర్యాదులు, వినతులు అందాయని తెలిపారు. వీటిలో కలెక్టరేట్‌లో 39, సంగారెడ్డి డివిజన్‌లో 10, జహీరాబాద్ డివిజన్‌లో 04, నారాయణఖేడ్ డివిజన్‌లో 02, వినతులు అందగా, అందోల్ డివిజన్‌లో ఒక్క ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. అందిన వినతులు ప్రధానంగా రెవెన్యూ, హౌసింగ్, పెన్షన్లు, పంచాయతీరాజ్ కాలుష్య నియంత్రణ మండలి, సంక్షేమ శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ రెవెన్యూ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



