వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులకు డ్రోన్ పైలట్ శిక్షణ ప్రారంభం
-ఆధునిక సాంకేతికతపై అవగాహనతో పాటు క్షేత్రస్థాయి నైపుణ్యాల పెంపు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 13 (రథసారథి న్యూస్): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కంది వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రాయోగిక నైపుణ్యాలను పెంపొందించేందుకు డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వ్యవసాయ ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం నుంచి తుది సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులకు నిర్ణీత ప్రణాళిక ప్రకారం దశలవారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా డ్రోన్ల నిర్వహణ, నడిపించడం, వ్యవసాయ రంగంలో వాటి వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ అందించనున్నారు. విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులందరికీ సమగ్రంగా డ్రోన్ పైలట్ నైపుణ్యాలను అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఆధునిక వ్యవసాయ రంగంలో వేగంగా విస్తరిస్తున్న డ్రోన్ సాంకేతికతతో పాటు దూరసంవేదన, భౌగోళిక సమాచార వ్యవస్థ, కృత్రిమ మేధస్సు వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, వాటి వినియోగంలో ప్రాయోగిక అనుభవం అందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కళాశాల వర్గాలు తెలిపాయి. ప్రతి వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనతో పాటు డ్రోన్ల నిర్వహణలో ప్రాయోగిక నైపుణ్యాన్ని కలిగి ఉండేలా శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఆధునిక, సాంకేతిక ఆధారిత వ్యవసాయ రంగంలో విస్తృత అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలవుతుందని కళాశాల వర్గాలు వెల్లడించాయి.



