Sangareddy

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి

-టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 27 (రథసారథి న్యూస్): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజీఈజేఏసీ) డిమాండ్‌ చేసింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీజీఈజేఏసీ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహం వద్ద భారీ మహాధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, సీపీఎస్‌ ఉద్యోగులు, కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్‌ ఎం.డి. జావీద్‌ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరారు. రెండో వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ)ను వెంటనే అమలు చేయడంతోపాటు, పెండింగ్‌లో ఉన్న ఆరు విడతల కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమన భత్యం (డీఆర్‌)లను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని (సీపీఎస్‌) రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్‌ బిల్లులను నెలకు రూ.2 వేల కోట్ల చొప్పున విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, వారి కుటుంబాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)ను సమర్థవంతంగా అమలు చేసి అన్ని ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు కల్పించాలని సూచించారు. ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని పెండింగ్‌ బిల్లులు, పదవీ విరమణ ప్రయోజనాలను ఆలస్యం చేయకుండా త్వరితగతిన చెల్లించాలని జావీద్‌ అలీ కోరారు. టీజీఈజేఏసీ జిల్లా కన్వీనర్‌, ప్రధాన కార్యదర్శి డా. వైద్యనాథ్‌ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు.

ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మహాధర్నా అనంతరం టీజీఈజేఏసీ నాయకులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ పాండుకు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ జిల్లా నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాధర్నాకు సహకరించిన పోలీసు శాఖతోపాటు, వార్తా ప్రసార మాధ్యమాల ప్రతినిధులకు టీజీఈజేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button