ఉద్యోగ మేళాతో యువతకు ఉద్యోగావకాశాలు
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్):
నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న సంగారెడ్డిలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రవికిరణ్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని ఐటీఐ అధునాతన సాంకేతిక కేంద్రంలో ఉదయం 10.30 గంటలకు మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
వివిధ ప్రైవేటు సంస్థల మానవ వనరుల ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. మేళాలో ప్రముఖ సంస్థల ద్వారా మొత్తం 122 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటీస్ ఫౌండేషన్‌లో 72, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 20, ఫ్లిప్‌కార్ట్‌లో 30 ఉద్యోగాలు ఉన్నాయని వివరించారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.
అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత విద్యార్హత ధ్రువపత్రాలు, బయోడేటా లేదా రిజ్యూమ్‌తో పాటు అవసరమైన పత్రాలను తీసుకుని ఉద్యోగ మేళాకు హాజరు కావాలని సూచించారు. మేళాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో సంప్రదించవచ్చని, 08455–271010 ఫోన్ నంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందవచ్చని జిల్లా ఉపాధి అధికారి తెలిపారు.



