మాతా శిశు ఆరోగ్య ఆసుపత్రిలో ఘటనపై విచారణ

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్):
మాతా శిశు ఆరోగ్య విభాగం (ఎంసీహెచ్) ఆసుపత్రిలో అనిత, ఆమె శిశువు ఉదయం మృతి చెందిన ఘటనపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ మాతా శిశు ఆరోగ్య విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర బుధవారం ఆసుపత్రిని సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, సంబంధిత అధికారులను అడిగి వివరాలు సేకరించారు.
బాధితురాలికి అందించిన వైద్య సేవలు, చికిత్సకు సంబంధించిన రికార్డులు, కేసు వివరాలను పరిశీలించి సమగ్రంగా విచారణ నిర్వహించారు. విచారణలో సేకరించిన వివరాలు, అందుబాటులో ఉన్న రికార్డులు, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విచారణలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. లలితాదేవి, పీఓఎంసీహెచ్ డాక్టర్ నాగనిర్మల, పీఓడీటీటీ డాక్టర్ శశాంక్ దేశ్పాండే, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సౌజన్యతో పాటు ఎంసీహెచ్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.



