Sangareddy

ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి

నోటీసులు అందుకున్న ఓటర్లకు అవసరమైన సహకారం అందించాలి -జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

-పెండింగ్‌లో ఉన్న నోటీసుల జారీని రెండు రోజుల్లో పూర్తి చేయాలి

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 07 (రథసారథి న్యూస్): ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేయాల్సిన పెండింగ్ నోటీసులను రెండు రోజుల్లోగా పూర్తిగా అందజేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేసి, పారదర్శకమైన, సమగ్ర ఓటరు జాబితాను రూపొందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా నోటీసుల జారీ, అందజేత, హియరింగ్‌ల నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

సంగారెడ్డి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ సంగీత, సంబంధిత ఈఆర్‌ఓలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో 4,60,387 నోటీసులు జనరేట్ చేయగా, 3,07,344 నోటీసులను సంబంధిత ఓటర్లకు అందజేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన నోటీసుల జారీ ప్రక్రియను వేగవంతం చేసి రెండు రోజుల్లోగా పూర్తి చేయనున్నట్లు సీఈఓ కు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏఈఆర్‌ఓలు ప్రతిరోజూ తమ పరిధిలోని సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలతో పెండింగ్‌లో ఉన్న పనులను సమీక్షిస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన పత్రాలను సమర్పించేలా బీఎల్‌ఓల ద్వారా వారికి తగిన అవగాహన, సహకారం అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న నోటీసుల జారీని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడంతో పాటు, హియరింగ్‌లను కూడా సకాలంలో నిర్వహించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగకుండా ఈఆర్‌ఓలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోని ప్రక్రియను పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంగీత, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button