అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిర్బంధంపై సంగారెడ్డిలో రాస్తారోకో
-ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాలతో బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 7 (రథసారథి న్యూస్): అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ప్రభుత్వం నిర్బంధ వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ నిరసనలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్, ప్రజావ్యతిరేక ప్రభుత్వం డౌన్ డౌన్, బీఆర్‌ఎస్ గొంతు నొక్కడం ఆపాలి అంటూ నినదించారు.
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు ఉందని, నిరసనలను పోలీసు బలగాలతో అడ్డుకోవడం సరికాదన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని పేర్కొన్నారు. పార్లమెంటులో నల్ల దుస్తులతో నిరసనకు అనుమతించినప్పుడు, అసెంబ్లీలో నల్ల దుస్తులతో నిరసన వ్యక్తం చేయడాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నాలను సహించేది లేదని, ప్రజా సమస్యలు, ఎన్నికల హామీల అమలుపై తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, చింత సాయినాథ్, మందుల వరలక్ష్మి, డాక్టర్ శ్రీహరి, మనోహర్‌గౌడ్, నాగరాజుగౌడ్, చక్రపాణి, యువజన నాయకులు శ్రవణ్‌రెడ్డి, వాజిత్, వేణుగోపాలస్వామి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



