గంగ కత్వ కాలువ ఆధునీకరణకు రూ.37.81 కోట్లు
జగ్గారెడ్డి చొరవతో నిధులు మంజూరు.. 3 వేల ఎకరాలకు సాగునీరు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 7 (రథసారథి న్యూస్): సదాశివపేట మండలం సూరారం గ్రామం నుంచి ప్రారంభమయ్యే నిజాం కాలం నాటి గంగ కత్వ కాలువ ఆధునీకరణకు ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి జగ్గారెడ్డి చొరవతో కాలువ ఆధునీకరణ పనులకు రూ.37.81 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ నీటిపారుదల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోని గంగ కత్వ కాలువ ఆధునీకరణ కోసం ఆయకట్టు రైతులు, స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు జగ్గారెడ్డి మూడు నెలల క్రితం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాలువ ఆధునీకరణకు తక్షణమే కొత్త ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించగా, ప్రభుత్వం వాటికి ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేసింది. నిధుల మంజూరుపై జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
-కిలోమీటర్ల మేర ఆధునీకరణ
గంగ కత్వ కాలువ సూరారం గ్రామం నుంచి ప్రారంభమై సదాశివపేట మండలంలోని 11 గ్రామాల మీదుగా మాచిరెడ్డిపల్లి వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ కాలువకు 33 చెరువుల నుంచి ఫీడర్ కాలువలు అనుసంధానమై ఉన్నాయి. ఆధునీకరణలో భాగంగా కాలువకు లైనింగ్ పనులు చేపట్టడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త వంతెనలు నిర్మించనున్నారు. పాత వంతెనలకు మరమ్మతులు చేపట్టడంతో పాటు కాలువ పొడవునా తూములకు మరమ్మతులు చేయనున్నారు. పనులు పూర్తయితే సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.



